
ములుగు, 11 నవంబర్ (హి.స.) భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు.
బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్. మహేందర్ జీ హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యావకాశాల విస్తరణకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, సామరస్యం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు