
అమరావతి , 11 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. విజయసాయి తాజాగా ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పార్టీకి సంబంధించిన జెండాను కూడా విజయసాయి ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రాన్ని ప్రత్యేక గుర్తుగా పొందుపరిచారు. ఈ చిహ్నం పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో కొనసాగుతుండగా, తాజాగా పరివర్తన రాజనీతి పార్టీ రాకతో రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. కొత్త పార్టీ భవిష్యత్ కార్యాచరణ, విధివిధానాలు, ప్రజల్లోకి వెళ్లేందుకు అనుసరించబోయే వ్యూహాలపై ఆసక్తి నెలకొంది. పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పాత్ర పోషిస్తారు? అన్నది వేచి చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్