
అమరావతి , 11 నవంబర్ (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 4న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి వేదికగా మూడు రోజులపాటు అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశానికి హాజరుకానున్నారు. దేశ భద్రత, శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, నేరాల నియంత్రణ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉంది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే పోలీసు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు అధికారులకు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి సంబంధించి భద్రత, వసతి, రవాణా తదితర ఏర్పాట్లు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో తిరుపతిలో ప్రత్యేక సందడి నెలకొననుంది. ఈ జాతీయ స్థాయి సదస్సు నిర్వహణతో తిరుపతి మరోసారి దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్