
పెద్దపల్లి, 11 నవంబర్ (హి.స.)
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయి మూల్యాంకనాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.
ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ సముద్రాల వంశీ మోహనాచార్యులు రూపొందించిన ‘పారఖ్ అభ్యసన దీపిక’ పుస్తకాన్ని బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ షేక్ తో కలిసి ఆయన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించేందుకు వినూత్న బోధనా పద్ధతులు పాటించాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. పారఖ్ జాతీయ మూల్యాంకనంలో తెలంగాణ ఉన్నత స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు.
25 ముఖ్యమైన అంశాలను ఎంపిక చేసి, వందలాది ప్రశ్నలతో ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా సొంత నిధులతో ముద్రించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందించడం ఎంతో అభినందనీయమని హెచ్ఎం వంశీ మోహనాచార్యులును కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..