రాప్తాడు నిందితుడి తొలగించిన కాలును భద్రపరచాలని హైకోర్టు ఆదేశం
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్కు సంబంధించి తొలగించిన కాలును భద్రపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
Court


అమరావతి , 11 నవంబర్ (హి.స.) అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్కు సంబంధించి తొలగించిన కాలును భద్రపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీసులతో పాటు అనంతపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్కు స్పష్టమైన సూచనలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని గోపికపై హేమంత్ రంపంతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో హేమంత్ గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా, గాయం తీవ్రత కారణంగా వైద్యులు అతడి కాలును తొలగించారు. ఈ నేపథ్యంలో తొలగించిన కాలును భద్రపరచాలని హైకోర్టు తాజాగా ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు, హేమంత్పై పోలీసులు జరిపిన కాల్పుల ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని పిటిషనర్ కోరినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande