
సంగారెడ్డి, 11 నవంబర్ (హి.స.)
సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పాండు, సంగీత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మాట్లాడిన వారు, విద్యే సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి పునాది అని స్పష్టం చేశారు. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మౌలానా ఆజాద్ దేశంలో విద్యారంగ పురోగతికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. యూజీసీ ఏర్పాటుతో పాటు ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు, సాంకేతిక, శాస్త్రీయ విద్యాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని వివరించారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త అయిన ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యతోనే ప్రపంచాన్ని మార్చగలమని విశ్వసించిన ఆజాద్ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్య వ్యక్తిగత వికాసానికే కాకుండా సమాజ సంక్షేమానికి, దేశ నిర్మాణానికి దోహదపడుతుందని చెప్పిన అదనపు కలెక్టర్లు, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యమిస్తూ అక్షరాస్యత కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..