విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
తెలంగాణలోని ముచ్చింతల్ శ్రీరామనగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ నిర్వహించిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్


హైదరాబాద్ , 11 నవంబర్ (హి.స.)తెలంగాణలోని ముచ్చింతల్ శ్రీరామనగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడ నిర్వహించిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ విరాట్ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు వేల మందికి పైగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని విష్ణు సహస్రనామాలను సామూహికంగా పఠించారు.

ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదమంత్రాలు, విష్ణు నామస్మరణతో శ్రీరామనగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు లభించడంతో నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ అరుదైన ఘనతపై మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామి మార్గదర్శకత్వంలో ఇంతటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమం నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande