
వరంగల్, 11 నవంబర్ (హి.స.)
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇచ్చారు. కాకతీయ వైద్య కళాశాల వార్షికోత్సవ వేడుకలు ‘ఉత్కర్ష్-2026’లో భాగంగా ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ కింద బుధవారం ఉదయం 6:30 గంటలకు కేఎంసీ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు హెల్త్ రన్, హెల్త్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజంలో విరివిగా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన ఒక్క పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. మార్గమధ్యంలోని సీపీఓ జంక్షన్ లో విద్యార్థులు నాటక, నృత్య ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఇన్ చార్జి ఏసీపీ నరసింహారావు, ప్రిన్సిపల్ డాక్టర్ డి. మోహన్ దాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..