
అమరావతి , 11 నవంబర్ (హి.స.)
శ్రీరామనగరంలో యతీంద్ర సప్తతి వేడుకలు నాలుగో రోజు ఘనంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా రోజంతా పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సమాజానికి విశేష సేవలందించిన వారిని గుర్తించి గౌరవించడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఉదయం 10 గంటలకు సమతా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలందించిన 70 మంది త్యాగధనులు, సేవామూర్తులకు ఈ పురస్కారాలను అందజేసి సత్కరించనున్నారు. సమాజ అభ్యున్నతికి, ప్రజాసేవకు వారు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మాతృసవనము కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం శ్రీకోదండ రాముడికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు జరగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్