
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అక్వాన్’ తీర ప్రాంతాల వైపు వేగంగా దూసుకొస్తోంది. రేపు శుక్రవారం తీరం దాటే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ మూడు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా వైపు కదులుతుండటంతో అక్కడే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలపైనా దీని ప్రభావం ఉండనుంది.
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 3 వేల తుఫాన్ షెల్టర్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు 50 వేల మందిని ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..