ఔషధ నియంత్రణలో కేంద్రం కీలక సంస్కరణలు: బల్క్ డ్రగ్ డీలర్లకు ప్రత్యేక లైసెన్సులు.. యాంటీబయోటిక్స్, మత్తుమందులపై కఠిన నిఘా!
ఔషధ నియంత్రణలో కేంద్రం కీలక సంస్కరణలు: బల్క్ డ్రగ్ డీలర్లకు ప్రత్యేక లైసెన్సులు.. యాంటీబయోటిక్స్, మత్తుమందులపై కఠిన నిఘా!
medicine


న్యూఢిల్లీ,, 19 నవంబర్ (హి.స.)

దేశంలో ఔషధాల విక్రయాలు, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు నకిలీ, ప్రమాదకర మందుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోల్‌సేల్ బల్క్ డ్రగ్ డీలర్లకు (Wholesale Bulk Drug Dealers) ప్రత్యేక లైసెన్సులను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దీనితో పాటు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) కలిగించే యాంటీబయోటిక్స్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) మందుల విక్రయాలపై నిఘాను మరింత కఠినతరం చేయనుంది.

ప్రస్తుతం సాధారణ హోల్‌సేల్ లైసెన్సులతోనే పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్స్ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ - API) వ్యాపారం సాగుతోంది. దీనివల్ల ముడిసరుకు ఎక్కడికి వెళ్తోంది, ఎవరు కొనుగోలు చేస్తున్నారు అనే దానిపై సరైన పర్యవేక్షణ కొరవడింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు బల్క్ డ్రగ్స్ విక్రయించే డీలర్లకు ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఔషధ తయారీ ముడిసరుకు సరఫరా గొలుసులో పూర్తి జవాబుదారీతనం ఏర్పడనుంది.

అలాగే, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ విక్రయించడం వల్ల ప్రజల్లో 'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్' (మందులకు లొంగని మొండి వ్యాధులు) ముప్పు తీవ్రమవుతోంది. దీనిని నివారించేందుకు యాంటీబయోటిక్స్ అమ్మకాలపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. మత్తుమందులుగా దుర్వినియోగమయ్యే ఎన్డీపీఎస్ (NDPS) జాబితాలోని ఔషధాల నిల్వలు, విక్రయాల రికార్డులను ఎప్పటికప్పుడు డిజిటల్ విధానంలో పర్యవేక్షించేలా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలలో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande