
న్యూఢిల్లీ, నవంబర్ 22(హి.స): రాజస్థాన్‌లోని కోటా–ఉదయపూర్ జాతీయ రహదారిపై శంభుపురా గ్రామానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటి గంట ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు రాష్ట్రపతి ‘ఎక్స్’ (X) వేదికగా సంతాపం తెలుపుతూ, కోటాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు క్రూయిజర్ వాహనంలో ప్రయాణిస్తున్నారు.
గత మంగళవారం మహారాష్ట్ర నుంచి తీర్థయాత్రకు బయలుదేరిన ఈ కుటుంబం, తొలుత మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌ను, అనంతరం రాజస్థాన్‌లోని పుష్కర్, ఖాటూ శ్యామ్‌జీ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది. యాత్ర ముగించుకుని శనివారం రాత్రి తిరిగి స్వస్థలానికి బయలుదేరిన క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi