
ఇటానగర్:, 22 నవంబర్ (హి.స.)
అరుణాచల్ ప్రదేశ్ పాలనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధిని విస్మరించిందని, తగినన్ని నిధులు కేటాయించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక, మౌలిక సదుపాయాల మద్దతు గణనీయంగా పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇటానగర్‌లో రాష్ట్ర సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు.
యూపీఏ హయాంలో 2004–2014 మధ్య అరుణాచల్ ప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ. 33,530 కోట్లు అందగా, ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో 2014–2024 మధ్య ఆర్థిక సహాయం రూ. 1,64,664 కోట్లకు చేరిందని షా గణాంకాలు వివరించారు. రాష్ట్రానికి పన్నుల వాటా నాలుగు రెట్లు, గ్రాంట్లు 18 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ బడ్జెట్ రూ. 12,000 కోట్ల నుంచి రూ. 36,000 కోట్లకు పెరగడమే రాష్ట్రంలో విస్తరిస్తున్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. గత 12 ఏళ్లలో రహదారి, రైలు, వాయు రవాణా అనుసంధానం మెరుగుపడటంతో దేశ రాజధానితో ఈశాన్య ప్రాంతానికి ఉన్న దూరం గణనీయంగా తగ్గిందని తెలిపారు.
సరిహద్దు గ్రామాలను చివరి గ్రామాలుగా కాకుండా దేశంలోని 'తొలి గ్రామాలుగా' ప్రధాని మోదీ అభివర్ణించారని, 'వైబ్రంట్ విలేజెస్' కార్యక్రమంతో సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని షా అన్నారు. ఈ కార్యక్రమం ప్రభావంతో అరుణాచల్ ప్రదేశ్‌లో వలసల ధోరణి మారి, దాదాపు 40 గ్రామాలకు ప్రజలు తిరిగి వచ్చారని, ఫలితంగా ఆయా గ్రామాల్లో జనాభా పెరిగిందని వెల్లడించారు. విద్యుత్, పాఠశాలలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు.
సహకార శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న అమిత్ షా, స్థానిక గ్రామ సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, గుడ్లు, కూరగాయలను సేకరిస్తున్నట్లు తెలిపారు. మహిళా సహకార సంఘాలు ఈ ఉత్పత్తులను ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలకు సరఫరా చేస్తున్నాయని, దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు భద్రతా సిబ్బంది, గ్రామస్తుల మధ్య అనుబంధం మరింత దృఢపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాడి, మాంసం, మత్స్య ఉత్పత్తులను పెంచాలని సూచిస్తూ, రాష్ట్రంలోని మొత్తం పాల ఉత్పత్తిని అమూల్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) సేకరిస్తాయని హామీ ఇచ్చారు. 185 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), 52 పాడి సహకార సంఘాలు, 43 మత్స్య క్షేత్రాలలో 50 వేలకు పైగా ప్రజలు అనుబంధంగా ఉన్నారని తెలిపారు. జలవిద్యుత్ రిజర్వాయర్లలో మత్స్య పరిశ్రమను ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, సుమారు రూ. 32,000 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న 2,880 మెగావాట్ల దిబాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు, బలిపారా–చార్దువార్–తవాంగ్ రహదారి, నెచిఫు సొరంగం, దిబాంగ్ లోయలోని సిసి నదిపై వంతెన, పసిఘాట్–దిబ్రూగఢ్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు-కమ్-రైలు వంతెన పనులను గుర్తుచేశారు. రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయని, ముఖ్యమంత్రి పేమా ఖండూ అభ్యర్థన మేరకు ఇటానగర్–ఢిల్లీ మధ్య రోజుకు రెండో విమాన సర్వీసు ఏర్పాటుపై విమానయాన సంస్థతో చర్చించినట్లు చెప్పారు.
కేంద్ర పథకాల లబ్ధిని వివరిస్తూ, 1.28 లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ సాయం, 2.30 లక్షల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు, 1.90 లక్షల మందికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, 1.68 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు, దాదాపు 45 వేల మందికి గృహ నిర్మాణ సహాయం అందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూ. 1,500 కోట్లతో 'మిషన్ శిక్షిత్ అరుణాచల్ ఫేజ్-2', రూ. 2,000 కోట్ల చొప్పున రాష్ట్ర విద్యుత్, గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు, 11 సరిహద్దు జిల్లాల్లో రూ. 110.95 కోట్లతో 199 వైబ్రంట్ విలేజెస్ ప్రాజెక్టులను షా ప్రారంభించారు. ఆహార ధాన్యాల గోదాము, ఆర్ఎస్ఆర్ఎల్ఎం (ArSRLM) ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ పోర్టల్, 'అరుణాచల్ ప్రదేశ్ కోఆపరేటివ్ విజన్ 2047'లను ఆవిష్కరించారు. అలాగే మొబైల్ మెడికల్ వ్యాన్‌ను ప్రారంభించి, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు విస్తృత మార్కెట్ కల్పించే సరస్ మేళాను ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi