
నిడదవోలు, 23 నవంబర్ (హి.స.)నిడదవోలు మున్సిపాలిటీలో వైస్ఛైర్మన్ పదవిని జనసేన పార్టీ దక్కించుకుంది. ఈ పదవికి జరిగిన ఎన్నికలో జనసేన అభ్యర్థి టి. కల్యాణచక్రవర్తి విజయం సాధించారు. ఎన్నిక సందర్భంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేనకు వైసీపీ, బీజేపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థికి మెజారిటీ లభించింది. మొత్తం ఓట్లలో జనసేనకు 18 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కల్యాణచక్రవర్తి వైస్ఛైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
అయితే ఈ ఎన్నిక కూటమి పార్టీల మధ్య విభేదాలకు దారితీసింది. వైస్ఛైర్మన్ పదవిని జనసేన దక్కించుకోవడంపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. కూటమి పొత్తులో భాగంగా తీసుకున్న నిర్ణయాలను పక్కనపెట్టి ఎన్నిక నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా వ్యవహరించారని విమర్శించారు. వైస్ఛైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ పరిణామంతో నిడదవోలు మున్సిపాలిటీలో కూటమి పార్టీల మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్