
అమరావతి , 23 నవంబర్ (హి.స.)
నవంబర్ నెలాఖరులో దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే దీనిపై తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి ఎలాంటి తుపాను హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 మధ్య కాలంలో దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధిపతి పి.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదని, ఒకవేళ బలపడినా శ్రీలంక లేదా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే సూచనలు లేవని, దీని తీవ్రత, మార్గంపై ఇంకా అధికారిక అంచనా వెలువడలేదని వివరించారు. ఉపరితల ఆవర్తనం అనేది ప్రాథమిక దశ మాత్రమేనని, ప్రతి ఆవర్తనం తుపానుగా మారదని, నవంబర్ 27 తర్వాత అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తదుపరి కదలికలపై ఒక అంచనాకు రాగలమని చెప్పారు.
మరోవైపు, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు, నెలాఖరులో రాబోయే ఆవర్తనానికి ఎలాంటి సంబంధం లేదని ఐఎండీ తెలిపింది. తూర్పు గాలుల (ఈస్టర్లీ వేవ్స్) ప్రభావంతో రానున్న కొద్దిరోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 22 నుంచి 28 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని, ముఖ్యంగా నవంబర్ 23 నుంచి 26 మధ్య ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరిలలో నవంబర్ 23 నుంచి 27 వరకు, కేరళలో నవంబర్ 24 నుంచి 26 వరకు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా, అండమాన్ నికోబార్ దీవుల్లో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ తీరానికి తుపాను ముప్పు గానీ, రెడ్ అలర్ట్ గానీ లేదని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా వాతావరణ శాఖ అధికారిక సమాచారాన్నే అనుసరించాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్