
తిరుమల , 24 నవంబర్ (హి.స.)తిరుమలలో సేవాభావంతో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ పోటులో పనిచేస్తున్న కార్మికులు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన కార్యక్రమానికి వెంకయ్యచౌదరి హాజరై రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో లడ్డూ పోటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. సేకరించిన రక్తాన్ని తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలనే సందేశాన్ని ఈ శిబిరం చాటిచెప్పింది.
రక్తదాన కార్యక్రమంలో స్విమ్స్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. రక్త సేకరణకు అవసరమైన వైద్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీటీడీ సిబ్బంది, కార్మికులు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్