
అమరావతి , 24 నవంబర్ (హి.స.)
విజయనగరం జిల్లాలోని భోగాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. భోగాపురం–సుందరపేట మార్గంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆయిల్ ట్యాంకర్ను ఓ కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
శ్రీముఖలింగం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను విశాఖ జిల్లాలోని సంగివలస, మధురవాడ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో బొర్రా సతీష్, ఆయన భార్య శ్రుతి, కొండపు సూరిబాబుతో పాటు వాకర్లపూడి శ్రీను, ఆయన భార్య కుసుమ రంజని ప్రాణాలు కోల్పోయారు. ఒకే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మృత్యువాత పడటంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్