
హైదరాబాద్ , 24 నవంబర్ (హి.స.)
రోడ్డు ప్రమాదంలో తన వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్ ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు కేటీఆర్ దంపతులు కూడా మణికుమార్ మృతిపట్ల సంతాపం తెలిపారు. కొన్నేళ్లుగా ఎర్రవెల్లిలోని తన నివాసంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మణికుమార్ ఆకస్మిక మరణం తనను కలచివేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బంధనకల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణికుమార్ మృతి చెందాడు. ఈ విషాద వార్త తెలుసుకున్న కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మణికుమార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
మణికుమార్ అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు కేసీఆర్ సూచించారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా తమ వద్ద పనిచేస్తూ కుటుంబ సభ్యుడిలా ఉన్న వ్యక్తి మృతి చెందడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మణికుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్