ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
Chandrababu Naidu


తిరుమల , 24 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఓ అజ్ఞాత భక్తుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించేందుకు ముందుకు వచ్చారు. ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేసిన ఆభరణాలను స్వామివారికి విరాళంగా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

భక్తుడు సమర్పించనున్న ఈ భారీ కానుకపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసంతో ఇంతటి విలువైన ఆభరణాలను సమర్పించేందుకు దాత ముందుకు రావడం విశేషంగా మారింది. మరోవైపు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా డిసెంబరులో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్ల జారీ విధానంపై ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు, టికెట్ల కేటాయింపుపై ప్రభుత్వం, టీటీడీ దృష్టి సారించనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande