ఢిల్లీని వీడని కాలుష్య ముప్పు.. 'పూర్' కేటగిరీలోనే గాలి నాణ్యత
ఢిల్లీని వీడని కాలుష్య ముప్పు.. 'పూర్' కేటగిరీలోనే గాలి నాణ్యత
delhi


ఢిల్లీ, 24 నవంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం ఉదయం 9 గంటల సమయానికి నగరంలోని సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 238గా నమోదై, గాలి నాణ్యత మరోసారి 'పేలవమైన' (Poor) స్థాయిలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వివరాల ప్రకారం, నగరంలోని పంజాబీ బాగ్ ప్రాంతం 271 AQIతో అత్యంత కాలుష్యభరిత ప్రాంతంగా మారింది.

పంజాబీ బాగ్‌తో పాటు చాందినీ చౌక్‌లో 263, బవానాలో 255, వివేక్ విహార్‌లో 245, వజీర్‌పూర్‌లో 235, సోనియా విహార్‌లో 234, రోహిణిలో 232 చొప్పున ఏక్యూఐ నమోదై ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఉత్తమ్ నగర్ (223), నరేలా (221), అలీపూర్ (219), అశోక్ విహార్ (206) ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత పేలవంగానే కొనసాగుతోంది. అయితే ఆనంద్ విహార్ (199), మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం (197), ఐజీఐ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-3 (183), వసుంధర ఎన్‌క్లేవ్ (181) వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాలుష్యం 'మధ్యస్థ' (Moderate) స్థాయిలో ఉండటంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది.

మరోవైపు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. కేవలం బీఎస్-6 (BS-VI) ప్రమాణాలున్న వాహనాలను మాత్రమే అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొంది. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా నగర సరిహద్దుల్లో గిడ్డంగులు నిర్మించి, అక్కడి నుండి చిన్న బ్యాటరీ వాహనాల ద్వారా సరుకులను లోపలికి పంపే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోర్టు సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande