
హైదరాబాద్ , 24 నవంబర్ (హి.స.)
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని పవిత్ర గోదావరి నది భక్తులతో సందడిగా మారింది. పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే నది ఘాట్ల వద్ద భక్తుల రాక మొదలవడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
కార్తిక మాసంలో పౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించడం విశేష పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో నదీ తీరానికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కార్తిక దీపాలను వెలిగించి గోదావరి నదిలో వదిలారు.
నదిలో దీపాలు తేలియాడుతుండటంతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్