
యాదగిరిగుట్ట, 24 నవంబర్ (హి.స.)
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్టలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కొండపైన సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్వామివారి వ్రతాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే వ్రత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కార్తిక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకుని వ్రతాల్లో పాల్గొంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు బ్యాచ్‌ల వారీగా వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నిర్ణీత క్రమంలో భక్తులకు వ్రతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వ్రత కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కార్తిక పౌర్ణమి వేడుకలతో యాదగిరిగుట్ట భక్తులతో సందడిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్