
జగిత్యాల , 24 నవంబర్ (హి.స.)
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు అంజనేయస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్వదినం సందర్భంగా నిర్వహించే గిరిప్రదర్శనలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది.
భక్తులు భక్తిశ్రద్ధలతో గిరిప్రదర్శన పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే నిజరూప దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఆలయానికి సుమారు 60 వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్ల నిర్వహణతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. కార్తిక పౌర్ణమి వేడుకలతో కొండగట్టు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్