
జనగామ, 24 నవంబర్ (హి.స.)
జనగామ జిల్లాలోని ప్రసిద్ధ పాలకుర్తి ఆలయం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. పర్వదినాన్ని పురస్కరించుకుని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
కార్తిక పౌర్ణమి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగుతోంది. మహిళలు సంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయ శిఖరంపై అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ జ్యోతిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్