కార్తిక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కార్తిక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు


హైదరాబాద్ , 24 నవంబర్ (హి.స.)

కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్రమైన ఈ రోజున పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి మొదలైంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి.

కార్తిక మాసంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆలయాల్లో శివనామస్మరణ, హరహర మహాదేవ అంటూ భక్తుల నినాదాలు మార్మోగుతున్నాయి. మహిళలు నదులు, చెరువులు, పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను వెలిగించి నీటిలో వదులుతున్నారు. మరికొందరు ఆలయాల్లో దీపారాధనలు నిర్వహిస్తున్నారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఉపవాసాలు, దీపారాధనలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande