
విజయనగరం , 24 నవంబర్ (హి.స.)
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోగాపురం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రమాద స్థలంలో విషాదకర వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో వెళ్తున్న జీపు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి జీపులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకే ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్