కళాకారులకు శుభవార్త.. నంది అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలుగు సినీ, టెలివిజన్, నాటక రంగాల కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల వేడుకలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
Ap government


అమరావతి , 24 నవంబర్ (హి.స.)

తెలుగు సినీ, టెలివిజన్, నాటక రంగాల కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల వేడుకలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ పురస్కారాల ప్రదానోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

2012 నుంచి 2025 వరకు నంది సినిమా, టెలివిజన్ పురస్కారాలను అందించడంతో పాటు, 2017 నుంచి 2025 వరకు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాలను నిర్వహించనున్నారు. వీటితోపాటు నంది నాటకోత్సవ అవార్డులు, కందుకూరి పురస్కారాల వేడుకలను కూడా అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15.28 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా అవార్డుల కోసం ఎదురుచూస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, సినీ ప్రముఖుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తెలుగు కళారంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఈ నిర్ణయం కీలక అడుగుగా భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande