
ఎన్టీఆర్ జిల్లా , 24 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలోని పైలెట్ ప్రాజెక్టు వద్ద క్లోరినేషన్ గ్యాస్ ట్యాంకు నుంచి వాయువు బయటకు వచ్చింది. సుమారు 500 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులో ఈ లీకేజీ చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్లాంటును చాలాకాలంగా వినియోగించకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్యాంకు నుంచి గ్యాస్ లీకై పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దాని ప్రభావంతో సమీపంలోని మొక్కలు మాడిపోయాయి. గ్యాస్ ఘాటైన వాసన పీల్చిన కొందరు సిబ్బందికి వాంతులు కావడంతో పాటు కళ్లలో మంటలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటూ గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనతో స్థానికంగా కొంతసేపు ఆందోళన నెలకొంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ప్లాంటును నిరుపయోగంగా వదిలేయడం, ట్యాంకు నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్