
శ్రీశైలం, 24 నవంబర్ (హి.స.)
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మార్మోగుతోంది.
కార్తిక మాసంలో పౌర్ణమికి విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా శ్రీశైలానికి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాన్ని పొందుతున్నారు.
ఈ పర్వదినంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే జ్వాలా తోరణోత్సవాన్ని రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. జ్వాలా తోరణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రిస్తూ దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కార్తిక పౌర్ణమి వేడుకలతో శ్రీశైలం భక్తజన సంద్రంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్