
అమరావతి , 24 నవంబర్ (హి.స.)గురునానక్ జయంతిని పురస్కరించుకుని సిక్కు సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురునానక్ బోధనలు, ఆయన చూపిన మానవతా మార్గాన్ని గుర్తుచేసుకున్నారు. సమాజంలో ప్రేమ, సోదరభావం, సేవాభావం పెంపొందించడంలో గురునానక్ బోధనలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు.
తోటి మనిషికి ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేయాలనే గురునానక్ సందేశం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని లోకేశ్ అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన బోధించిన విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇతరులకు సహాయం చేయడం, అందరినీ సమానంగా చూడటం, శాంతి మార్గంలో నడవడం వంటి సందేశాలు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గురునానక్ ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు ఆయన చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని మంత్రి ఆకాంక్షించారు. గురునానక్ జయంతి వేడుకలు సిక్కు సమాజంలో ఆనందోత్సాహాల మధ్య జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్