
పల్నాడు , 24 నవంబర్ (హి.స.)పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. క్రోసూరు మండలం ఊటుకూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూడా ప్రమాద సమయంలో కారులోనే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. క్రోసూరుకు చెందిన నలుగురు వ్యక్తులు అమరావతిలోని ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ రాత్రి నిద్ర చేసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఊటుకూరు సమీపానికి చేరుకోగానే కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాడి పూర్ణచంద్ర (50), దగ్గుబాటి శ్రీనివాసరావు (48) తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. వీరిద్దరూ క్రోసూరు ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆలయ దర్శనం అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఇద్దరి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్