దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు.. షోపియాన్లోని పలు గ్రామాల్లో భద్రతా దళాల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
దక్షిణ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు.. షోపియాన్లోని పలు గ్రామాల్లో భద్రతా దళాల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
CISFની દિલ્હી એરપોર્ટ પર મોક એક્સરસાઇઝ,અનેક એજન્સીઓ વચ્ચે સંકલન દર્શાવ્યું


శ్రీనగర్: , 24 నవంబర్ (హి.స.)

దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల నుండి అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు మంగళవారం (నవంబర్ 24) భారీ స్థాయిలో 'కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు' (CASOs) చేపట్టాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించి, నివాస ప్రాంతాల్లో ఇంటింటా సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఆర్మీకి చెందిన 44 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది అల్షిపోరా, గుండ్ దర్వేష్, బంద్‌పావా తదితర గ్రామాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాలు పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని దిగ్బంధించాయి. అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇటీవల కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LeT) అగ్ర ఉగ్రవాది లతీఫ్ భట్ హతమైన నేపథ్యంలో ఈ తాజా గాలింపు చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 11న కుల్గాంలోని అఖ్రాన్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ (CRPF) చెక్‌పోస్ట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ దాడిలో లతీఫ్ భట్ కీలక పాత్ర పోషించాడు. అనంతరం నవంబర్ 18న కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మసీదులో నక్కి లొంగిపోవడానికి నిరాకరించిన భట్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా దళాలను అభినందిస్తూ, కశ్మీర్ లోయలో ప్రాణాలతో ఉన్న చివరి స్థానిక లష్కరే తోయిబా ఉగ్రవాది భట్ అని పేర్కొన్నారు.

మరోవైపు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న పలువురు ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను (OGWs) భద్రతా దళాలు ఇటీవల అరెస్ట్ చేశాయి. అలాగే, నిషేధిత లష్కరే తోయిబాకు సంబంధించిన టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తులో భాగంగా ఈ నెల ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శ్రీనగర్‌లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సరిహద్దు ఆవల ఉన్న హ్యాండ్లర్లతో స్థానికులకు ఉన్న ఆర్థిక సంబంధాలు, నిధుల మూలాలను గుర్తించేందుకు ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande