
అమరావతి , 24 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కొత్త విభాగం పనిచేయనుంది. డీజీపీ పరిపాలనా, కార్యాచరణ పర్యవేక్షణలో డైరెక్టరేట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
ఈ విభాగానికి ఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్‌గా, డీఐజీ స్థాయి అధికారిని సహాయకుడిగా నియమించనున్నారు. కొత్త వ్యవస్థ కోసం అదనపు నియామకాలు చేపట్టకుండా, ప్రస్తుతం పోలీసు శాఖలో అందుబాటులో ఉన్న సిబ్బందినే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా 75 మంది సిబ్బందితో డైరెక్టరేట్‌ను నిర్వహించనున్నారు. తద్వారా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించడం, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను పర్యవేక్షించడం, జాతీయ రహదారులపై పెట్రోలింగ్‌ను సమన్వయం చేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్