బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి
నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది.
Unidentified dead body


నిర్మల్, 24 నవంబర్ (హి.స.)

నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మృతుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్గా గుర్తించారు. రాత్రి సమయంలో తన హాస్టల్ గదిలోనే ఉరివేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన ఇతర విద్యార్థులు వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. దీంతో కళాశాల యాజమాన్యం స్పందించి అవసరమైన చర్యలు చేపట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, ఆత్మహత్యకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సంపత్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా, చదువుకు సంబంధించిన ఒత్తిడా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో బాసర ఆర్జీయూకేటీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande