
హైదరాబాద్ , 24 నవంబర్ (హి.స.)హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బాచుపల్లి పరిధిలోని దినేష్ ఆర్కే అపార్ట్మెంట్లో జరిగింది. అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసే పనిలో భాగంగా కార్మికులు లోపలికి దిగినట్లు సమాచారం.
అయితే ట్యాంకులో ఉన్న విషవాయువుల కారణంగా వారు తీవ్ర అస్వస్థతకు గురై బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఊపిరి అందక ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అపార్ట్మెంట్ పరిసరాల్లో విషాదం నెలకొంది. కార్మికుల మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు. సెప్టిక్ ట్యాంకులో విషవాయువుల ప్రభావం ఎంతవరకు ఉందనే అంశంతో పాటు, కార్మికులు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి. సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తుచేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్