
నెల్లూరు , 24 నవంబర్ (హి.స.)నెల్లూరు జిల్లాలో చిరుత సంచారం ఉందన్న సమాచారంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతసాగరం మండలం మంచాలపల్లి కొండ ప్రాంతంలో చిరుత కనిపించిందంటూ ప్రచారం జరగడంతో కలకలం నెలకొంది. కొండ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అనుమానించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో స్పందించిన అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుత సంచరించినట్లు భావిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ కనిపించిన ఆనవాళ్లను తనిఖీ చేశారు. అయితే ఆ ఆనవాళ్లు చిరుతకు సంబంధించినవేనా అనే విషయంలో అధికారులు స్పష్టతకు రాలేదు. అవి చిరుతవి కాకపోయి ఉండవచ్చని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదని, కొండ ప్రాంతాలు, అటవీ పరిసరాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పశువుల కాపరులు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుత సంచారంపై వస్తున్న సమాచారాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు, వన్యప్రాణుల సంచారంపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు. దీంతో మంచాలపల్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్