
అమరావతి , 25 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లలో మేయర్, కార్పొరేటర్ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. నాలుగు కార్పొరేషన్లలో మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 11.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 12 వేల మంది సిబ్బందిని నియమించారు. భద్రతాపరంగా 409 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా, 172 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు.
ఇదే సమయంలో 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. ఛైర్మన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు, 707 వార్డులకు 2,057 మంది పోటీ పడుతున్నారు. ఈ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 13.53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల కోసం 14 వేల మంది సిబ్బందిని అధికారులు సిద్ధం చేశారు. 410 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా, 425 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్