
అమరావతి , 25 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్