
మెదక్, 25 నవంబర్ (హి.స.)
తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో శిశు మందిర్ పాఠశాల నిర్మాణానికి గురువారం భూమి పూజ జరిగింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ, తన వృత్తి జీవితం ఉపాధ్యాయుడిగా మొదలైందని, విద్యారంగం, విద్యార్థుల అభివృద్ధి పట్ల తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పారు. తరగతి గదుల్లోనే దేశ నిర్మాణం జరుగుతుందని, విద్యార్థులకు పుస్తకాల జ్ఞానంతో పాటు సమాజం, క్రీడా మైదానాలు, వాస్తవ జీవిత పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులను డాక్టర్, ఇంజనీర్ వంటి వృత్తులకే పరిమితం చేయకుండా, వారి ఆసక్తి, అభిరుచి, సామర్థ్యాలను గుర్తించి నచ్చిన రంగంలో ఎదిగేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యా విధానంలోనూ మార్పులు రావాలని, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన 2020 నూతన విద్యా విధానం విద్యార్థుల సమగ్ర వికాసానికి ఉపయోగపడుతుందని అన్నారు. నలంద, తక్షశిల వంటి భారతదేశ ప్రాచీన విద్యా కేంద్రాల స్ఫూర్తిని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..