
కాకినాడ , 25 నవంబర్ (హి.స.)
కాకినాడ జిల్లాలో బోటుతో సహా సముద్రంలో అదృశ్యమైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పాడ సమీపంలోని సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 11న సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. మొదట్లో కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినప్పటికీ, గత పది రోజులుగా వారి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు.
ఈ నెల 14న చివరిసారిగా మత్స్యకారులు తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి రోజు నుంచి వారి సెల్ఫోన్లు పనిచేయడం లేదు. అంతేకాకుండా వారు ప్రయాణిస్తున్న బోటుకు సంబంధించిన ట్రాన్స్‌పాండర్ సిగ్నల్స్ కూడా నిలిచిపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. సముద్రంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందేమోనని కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
తమవారి ఆచూకీ కనుగొని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని బాధిత కుటుంబాలు అధికారులను కోరుతున్నాయి. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అదృశ్యమైన మత్స్యకారుల కోసం సముద్ర తీర ప్రాంతాల్లోనూ, సముద్ర జలాల్లోనూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. పదిరోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో సుబ్బంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్