
అమరావతి , 25 నవంబర్ (హి.స.)
ప్రజలపై కొత్త పన్నుల భారం మోపకుండా, ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల్లో జరుగుతున్న లీకేజీలను అరికట్టడంతో పాటు వ్యవస్థలోని లోపాలను గుర్తించి సరిదిద్దాలని సూచించారు. పారదర్శకత, ఆన్లైన్ సేవలు, సాంకేతిక సంస్కరణల ద్వారా ఆదాయ వృద్ధి సాధించాలని దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.11,738 కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని, ఇది 18.7 శాతం వృద్ధి అని వివరించారు. వార్షికంగా నిర్దేశించుకున్న రూ.1.27 లక్షల కోట్ల లక్ష్యంలో ఇప్పటికే 58 శాతం సాధించినట్లు తెలిపారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 18.8 శాతం, పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి నమోదైంది.
ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.20,083 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.8,020 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. పన్ను రిటర్నుల పరిశీలనతో పాటు ఆడిట్లు, తనిఖీలు, న్యాయపరమైన వ్యవహారాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని విస్తరించాలని సీఎం సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్