
హనుమకొండ, 25 నవంబర్ (హి.స.) హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్‌లో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గ్రామంలో ఇప్పటి వరకు ఎంత భూమి సర్వే అయింది, ఇంకా ఎంత మిగిలి ఉంది, మరెన్ని రోజుల్లో పూర్తవుతుందనే వివరాలను సర్వేయర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. కొలతల విధానం, ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాల గురించి ఆరా తీశారు. అక్కడి రైతులు, ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడారు.
సర్వేలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, కొలతలను పక్కాగా చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే పూర్తయ్యాక ప్రతి రైతుకు తన భూమి విస్తీర్ణంపై స్పష్టమైన వివరాలు అందించాలని చెప్పారు.
రీ సర్వేను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అదనంగా మరో రోవర్‌ను కేటాయించినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..