
జనగామ, 25 నవంబర్ (హి.స.)
మార్చి 2027లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జనగామ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
రోజుకు రెండు గంటల పాటు ఈ ప్రత్యేక బోధన ఉంటుంది. పాఠశాల సమయానికి ముందు గంట, సాయంత్రం గంట చొప్పున తరగతులు నిర్వహిస్తారు. ఇంకా పూర్తికాని సిలబస్ ను పూర్తి చేయడంతో పాటు కష్టమైన పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. పాత ప్రశ్నపత్రాలను సాధన చేయించడం, పరీక్షలు నిర్వహించడం, జవాబులు రాసే విధానంపై శిక్షణ ఇవ్వడం కూడా ఈ తరగతుల్లో భాగంగా ఉంటుంది.
6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం రెమిడియల్ తరగతులు నిర్వహించనున్నారు. చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, గణిత సామర్థ్యాలను పెంచడంపై దృష్టి పెడతారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
ఈ తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యా పురోగతిని మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. ప్రధానోపాధ్యాయులు టైం టేబుల్ రూపొందించి బోధన వివరాలు, హాజరు, పరీక్షల ఫలితాలు, విద్యార్థుల పురోగతికి సంబంధించిన రికార్డులు నిర్వహించాలి. డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు