స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు: ఐజీ బి.రాజకుమారి
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు ఐజీ బి.రాజకుమారి వెల్లడించారు.
Vote


అమరావతి , 25 నవంబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు ఐజీ బి.రాజకుమారి వెల్లడించారు. ఎన్నికల విధుల కోసం మొత్తం 46,350 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇందులో ఎన్నికల బందోబస్తు కోసం 16,701 మంది పోలీసులను ప్రత్యేకంగా కేటాయించామని పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నిర్వహణకు మరో 29,649 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు వివరించారు.

పోలీసులతో పాటు రైల్వే, ఈగల్ విభాగం, ఇతర ప్రత్యేక బలగాలను కూడా భద్రతా విధుల్లో భాగస్వాములను చేసినట్లు ఐజీ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డ్రోన్లు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పిస్తున్నామని ఐజీ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande