
శ్రీశైలం , 25 నవంబర్ (హి.స.)
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి డిసెంబర్ నెలలో వచ్చే భక్తుల కోసం దేవస్థానం కీలక ప్రకటన చేసింది. నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను విడుదల చేసినట్లు ఆలయ చైర్మన్, ఈవో వెల్లడించారు. భక్తులు ముందుగానే ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని స్వామివారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.
టికెట్ల బుకింగ్‌లో భాగంగా 80 శాతం టికెట్లను మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా కేటాయించనున్నారు. మిగిలిన 20 శాతం టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా భక్తులు పొందవచ్చు. ఇందుకోసం www.tms.ap.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు. మనమిత్ర వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలనుకునే భక్తులు 95523000009 నంబర్‌కు సంప్రదించవచ్చు.
డిసెంబర్ నెలలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. టికెట్ల కోసం చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శన, సేవా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్