
ఖమ్మం, 25 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా కోనిజెర్ల మండలం లాలాపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన బాధను తట్టుకోలేక 29 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్న కుమారులతో కలిసి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ ఘటనలో ఆ తల్లి, ఆమె చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోగా, పెద్ద కుమారుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
లాలాపురంకు చెందిన రంజాన్ బీకి 8 ఏళ్లు, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఆమె భర్త చనిపోవడంతో ఆమె తీవ్ర మానసిక వేదనలో ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆమె ఈ నెల 19న తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. మొదట్లో ఎవరికీ అనుమానం రాలేదు. రెండు రోజుల తర్వాత పిల్లలకు వాంతులు మొదలవడంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఇద్దరు చిన్నారులను హైదరాబాద్ తరలించారు. తల్లికి ఖమ్మంలోనే చికిత్స కొనసాగించారు. అయినప్పటికీ మంగళవారం మధ్యాహ్నం చిన్న కుమారుడు నహీమ్ చికిత్స పొందుతూ మరణించాడు. అదే రోజు రాత్రి రంజాన్ బీ కూడా కన్నుమూసింది. పెద్ద కుమారుడు నిస్సానొద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు