
హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)
'డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్.. డ్రగ్స్ ఫ్రీ ఇండియా' లక్ష్యంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం నగరంలో ‘నషా ముక్త్ భారత్’ పేరుతో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పాదయాత్రను ప్రారంభించారు. విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా నేటి నుంచి మూడు రోజుల పాటు (నవంబర్ 25, 26, 27 తేదీల్లో) అంబర్‌పేట నుండి జూబ్లీహిల్స్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
బుధవారం ఉదయం 9 గంటలకు అంబర్‌పేటలోని మహంకాళి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని యాత్రకు సంఘీభావం తెలిపారు.
తొలిరోజు అంబర్‌పేట నుండి మొదలైన ఈ పాదయాత్ర ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్, ఇఫ్లూ (EFLU), గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ వరకు సాగనుంది. సాయంత్రం ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద తొలిరోజు యాత్రను ముగించి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi