
అమరావతి , 25 నవంబర్ (హి.స.)
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు రెండో అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ బాక్స్‌ను లాక్కోవడంతో పాటు ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు లేళ్ల అప్పిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైలులో ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయనపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, కేసు దర్యాప్తు ఇంకా కీలక దశలో కొనసాగుతోందని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో లేళ్ల అప్పిరెడ్డి మరికొంతకాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వైఎస్సార్సీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్