
నిజామాబాద్, నవంబర్ 25:(హి.స.)
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కంఠేశ్వర్‌లో కొలువై ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల పాలిట శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొంగు బంగారమని కొనియాడారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున స్వామి వారిని దర్శించుకుని, మరుసటి రోజు అభిషేకం నిర్వహించడం తమ కుటుంబ ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అర్చకులు తన దృష్టికి తీసుకువచ్చారని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ బిడ్డగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని సేవలందిస్తున్న యువతను ఆమె ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కవిత కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi