కనుమూరు అటవీ ప్రాంతంలో ఐదోరోజూ పెద్దపులి సంచారం.. ట్రాకర్ సిగ్నల్ సమస్యతో అటవీ అధికారుల ముమ్మర గాలింపు, గ్రామస్తులకు హై అలర్ట్
కనుమూరు అటవీ ప్రాంతంలో ఐదోరోజూ పెద్దపులి సంచారం.. ట్రాకర్ సిగ్నల్ సమస్యతో అటవీ అధికారుల ముమ్మర గాలింపు, గ్రామస్తులకు హై అలర్ట్
TIGER DEATH IN UP


ఎన్టీఆర్ జిల్లా (గంపలగూడెం), నవంబర్ 25 (హి.స.)

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం బుధవారంతో ఐదో రోజుకు చేరుకుంది. గత ఐదు రోజులుగా పులి అదే అటవీ ప్రాంతంలో తిష్ట వేయడంతో అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఆపరేషన్ టైగర్‌ను ముమ్మరం చేశాయి.

అయితే, గత రెండు రోజులుగా పులి కదలికలకు సంబంధించిన ట్రాకర్ సంకేతాలు స్పష్టంగా అందకపోవడంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పులి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు ట్రాకర్ సిగ్నల్స్ గుర్తించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. కనుమూరు ఫారెస్ట్‌లో పులికి అవసరమైన ఆహారం, నీరు పుష్కలంగా లభిస్తుండటం, అనువైన వాతావరణం ఉండటంతో అది అక్కడే మకాం వేసినట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది.

సిగ్నల్ సమస్యలు ఎదురైనప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటవీ ప్రాంతానికి నలువైపులా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పెద్దపులికి ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్, అటవీశాఖ అధికారులు సూచించారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని, ఒంటరిగా అటవీ ప్రాంతాలు లేదా పొలాల వైపు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande